ఒక్కటి కాదు.. ఏకంగా 33 చోరీలు: పోలీసుల వలలో ట్రాన్స్‌ఫార్మర్ గ్యాంగ్

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా (Bhainsa) సబ్‌ డివిజన్‌ పరిధిలో గత ఎనిమిది నెలలుగా వరుస ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ (Sai Kiran) తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌‌కు చెందిన పిడికి గణేష్‌, ఘోగరే దీపక్‌, గంటలవాడ సాయినాథ్‌, గజానంద్‌, నక్కలవాడ్‌ గణేష్‌, భైంసా పట్టణానికి చెందిన పిట్లోల్ల పోశెట్టి, ఓ మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్‌ లు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు.

నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ముధోల్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 33 ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.

ముధోల్‌ పోలీస్‌స్టేషన్‌లో 8, తానూర్‌లో 11, కుభీర్‌లో 4, బాసరలో 3, భైంసా టౌన్‌లో 3, భైంసా రూరల్‌లో 2, కుంటాలలో 2 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 230 కిలోల రాగి తీగ, నాలుగు బైకులు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>