కలం డెస్క్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై (Palamuru Rangareddy Project) కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలోకంటే ఎక్కువ ద్రోహం కేసీఆర్ పాలనలోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కృష్ణా జలాల్లో కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. అసెంబ్లీ వేదికగా జరిగే చర్చలో పరస్పరం మాటల తూటాలు పేల్చుకోనున్నారు. వీటికి బలం చేకూర్చే విధంగా రెండు పార్టీల నేతలు పన్నెండేండ్లుగా కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను ప్రదర్శించుకోనున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో సహా తిప్పికొట్టడానికి సర్కారు సిద్ధమవుతున్నది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గణాంకాలను వెల్లడించనున్నది. అదే పీపీటీ ప్రదర్శనకు తమకు కూడా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది.
కేసీఆర్ చెప్పవన్నీ పచ్చి అబద్ధాలే :
బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి సౌకర్యాలు కలిగితే కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో తెలంగాణకు కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరుగతున్నదనేది కేసీఆర్ ఆరోపణ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పనులు దాదాపు 90% పూర్తయితే పెండింగ్‌లో ఉన్న 10% పనులపై కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నోటిమాటగా వ్యాఖ్యానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) ఆధారాలతో సహా సభలో ప్రస్తావించడానికి సిద్ధమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌లో రూ. 55,086 కోట్లుగా అంచనా వ్యయాన్ని చూపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అది దిగిపోయేనాటికి ఖర్చు పెట్టింది రూ. 27 వేల కోట్లేనని, సగం కూడా కంప్లీట్ కాకుండా 90% పనులు పూర్తయినట్లు చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. 35% పనులు కూడా పూర్తికాలేదన్నారు.
పదేండ్లలో ఆన్ అయింది ఒక్క మోటారే :
పాలమూరు ప్రాజెక్టులో పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మోటార్ పంపుసెట్‌ను మాత్రమే కమిషన్ (ఆన్ చేయడం) చేసిందని, కాంగ్రెస్ ఈ రెండేండ్లలోనే 11 పంపులను ఇన్‌స్టాల్ చేసిందని, త్వరలోనే ఆన్ అవుతాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పాలమూరుపై పక్షపాత ధోరణితోనే కేవలం రూ. 27 వేల కోట్లను ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం లక్ష కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు. పదేండ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మొత్తం రూ. 1.83 లక్షల కోట్లు ఖర్చు పెడితే అందులో పాలమూరు ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లేనని అన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయకూడదన్న సంకుచిత ధోరణితోనే పాలమూరు ప్రాజెక్టును పక్కకు పెట్టారని అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి రీ-డిజైనింగ్ పేరుతో సొంత ఖ్యాతి కోసం పాకులాడారని అన్నారు. ఇలాంటి విషయాలన్నింటినీ పీపీటీ ప్రదర్శన సమయంలో మంత్రి ఉత్తమ్ వెల్లడించనున్నారు.
ఈ టర్ములోనే పాలమూరు కంప్లీట్ :
పాలమూరు ప్రాజెక్టుకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా పరస్పరం ఇరు పార్టీల నేతలు దూషించుకునే అవకాశాలున్నాయి. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలను బీఆర్ఎస్ (BRS) కేటాయిస్తే దాన్ని 45 టీఎంసీలు సరిపోతాయంటూ కాంగ్రెస్ లేఖ రాసిందని ఇటీవల కేసీఆర్ కామెంట్ చేయడం దుమారం రేపింది. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారాల వ్యవధిలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటూ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రాసిన లేఖను, దానికి కేంద్ర జలశక్తి మంత్రి నుంచి వచ్చిన జవాబును మంత్రి ఉత్తమ్ బహిర్గతం చేయనున్నారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతున్నందున 45 టీఎంసీలపై ఇప్పుడే చెప్పలేమంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణను కూడా వెల్లడించనున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ టర్ములోనే పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేసి తీరుతామని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తరఫున మంత్రి హామీ ఇవ్వనున్నారు.
Read Also: మునిసిపోల్స్ కు మొదలైన కసరత్తు
Follow Us On: Youtube


