కలం డెస్క్ : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ బాడీలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. మొత్తం 117 మున్సిపాలిటీలు, ఆరు నగరపాలక సంస్థలకు ఎన్నికలను (Municipal Elections) నిర్వహించే ఉద్దేశంతో వార్డువారీగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తొలి నుంచీ భావిస్తున్నట్లుగానే మున్సిపల్ ఎన్నికలను వీలైనంత తొందరగా నిర్వహించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్ణయం తీసుకున్నది. ఆ శాఖ ఆదేశం మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల చేసింది. జనవరి చివరి వారంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. జనవరి 10వ తేదీకల్లా తుది జాబితాను రూపొందించనున్నది.
ఎంఏయూడీ నిర్ణయంతో ప్రక్రియ స్టార్ట్ :
రాష్ట్రంలోని మొత్తం 153 మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో 128 మునిసిపల్ బాడీల గడువు ఈ ఏడాది జనవరితోనే ముగిసిపోయింది. ఇందులో తొమ్మిది కార్పొరేషన్లు, మరో 119 మునిసిపాలిటీలు ఉన్నాయి. అప్పటి నుంచీ ఇవి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. కొన్నింటికి లీగల్ చిక్కులు ఉన్న దృష్ట్యా అవి మినహా మిగిలిన 123 మునిసిపల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేలా ఎంఏయూడీ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది. స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు సైతం ఈ నెల 27న ఆ శాఖ కమిషనర్ శ్రీదేవి లేఖ రాశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నదని, వచ్చే నెల 9న ఆ ప్రక్రియ ముగుస్తుందని, దానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో వివరణ ఇచ్చారు. దీని ఆధారంగా ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేస్తున్నది.
ఆరు కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలు :
ఎంఏయూడీ కమిషనర్ శ్రీదేవి లేఖ ప్రకారం మొత్తం 117 మునిసిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 31 జిల్లాల్లోని 117 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశమున్నది. మొత్తం 2,996 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం పాపులేషన్ 57,41,111. ఇందులో ఎస్సీలు 7,75,653 మంది, ఎస్టీలు 2,46,764 మంది. ఇప్పటివరకూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణులు ఓటు వేయగా ఇప్పుడు పురపాలికల ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఓటు వేయనున్నారు. అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన తర్వాత ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలును ప్రకటించనున్నది.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు ఇలా :
మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడంలో భాగంగా ఓటర్ల జాబితాపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. తొలుత పోలింగ్ స్టేషన్లవారీగా ఈ నెల 30న డేటాను క్రోడీకరించి, ఆ తర్వాతి రోజు వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలవారీగా జాబితాను రూపొందిస్తుంది. జనవరి 1వ తేదీన ఈ మున్సిపాలిటీల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత జనవరి 5వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను ఆయా మునిసిపల్ కమిషనర్లు సేకరిస్తారు. మరుసటి రోజున జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులు ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తారు. ముసాయిదా జాబితా ప్రదర్శన అనంతరం ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను, ఫిర్యాదులను పరిష్కరించి తుది జాబితాను జనవరి 10న విడుదల చేస్తుంది. దాని ఆధారంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.
Read Also: యమపాశంలా చైనా మాంజా.. ఎన్ని మెడలు తెగాయో తెలుసా?
Follow Us On: X(Twitter)


