కలం, కరీంనగర్: రాజకీయ నాయకుల ప్రసంగాల కంటే కవులు, గాయకులు ఆలపించే పాటలు ప్రజలను మరింతగా ఆకర్షించి ఆలోచింపజేస్తాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర నిర్మాణ బాధ్యులు కలవేన శంకర్ అన్నారు. ఏఐటీయూసీ(AITUC) రాష్ట్ర మహాసభల సందర్భంగా ఉద్యమ చరిత్ర, కార్మికుల పోరాటాలను పాటలు, ఒగ్గు కథలు, బుర్రకథల రూపంలో ప్రజలకు వివరించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో రెండు రోజులుగా నిర్వహించిన కళాకారుల శిక్షణా శిబిరం సోమవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలవేన శంకర్ మాట్లాడారు.
కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాటం
దేశంలోనే తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని కలవేన శంకర్ తెలిపారు. 105 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అనేక మంది కార్మికుల ప్రాణ త్యాగాలతో ఈ సంఘం ముందుకు సాగిందన్నారు. దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, చట్టాలను కాపాడేందుకు ఏఐటీయూసీ నిరంతరం పోరాటాలు చేస్తోందని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న సమ్మె హక్కును హరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు కరీంనగర్ నగరంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
కళాకారుల పాత్ర కీలకం
మహాసభల కోసం రెండు రోజులుగా కళాకారులు ఆట, పాటలను నేర్చుకోవడం అభినందనీయమన్నారు. కార్మిక వర్గ సమస్యలు, వారి పోరాటాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేలా కళాకారులు తమ పాటలను రూపొందించి ప్రదర్శించాలని సూచించారు. మారుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో నాయకుల మాటల కంటే గాయకుల పాటలు ప్రజలకు మరింతగా చేరువవుతున్నాయని శంకర్ అన్నారు. కళాకారులు తమ సాంస్కృతిక, కళా నైపుణ్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు మహాసభల సందర్భంగా నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభలో ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
ఈ శిక్షణా శిబిరంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, న్యాలపట్ల రాజు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదానందం, ఎజ్జ రాజయ్య, ఆసాల రమ, ఇందిర, సరిత, గుర్రం సదానందం, లక్ష్మణ్, ఎర్రోజు శ్రీనివాస్, డప్పురాజు, బోలుమల్ల రాజమౌళి, బరిగెల విజయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

