కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని బీఆర్‌ఎస్ జాతీయ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) తీవ్రంగా విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ లోక బాపు రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు 1,023 గురుకులాలను ఏర్పాటు చేశామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులపై ఏటా ఒక్కొక్కరికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందించామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందడం లేదని ఆరోపించారు.
ఇప్పటివరకు 107 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఈ ఘటనలపై స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2,000 పాఠశాలలు సక్రమంగా పనిచేయడం లేదని లేదా మూతపడ్డాయని, దీంతో 1.26 లక్షల మంది పేద విద్యార్థులు అడ్మిషన్లకు దూరమయ్యారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు వస్తున్న మంచి పేరును ఓర్వలేక గురుకుల వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గురుకులాలను నిర్వీర్యం చేసేందుకే ‘యంగ్ ఇండియా’ స్కూళ్లు
రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ విధానం వెనుక గురుకుల వ్యవస్థను పూర్తిగా అణచివేయాలనే ఉద్దేశం ఉందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.15,600 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాల పేరుతో నిధులు కేటాయించడం వెనుక కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చే స్కామ్ దాగి ఉందని విమర్శించారు. ఉన్న విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా కొత్త ప్రయోగాల పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించాలి
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అమలు చేసిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్’ను గతంలో 9 వేల నుంచి 26 వేల మంది విద్యార్థులకు పెంచామని తెలిపారు. ప్రస్తుతం 236 పాఠశాలలకు ప్రభుత్వం సుమారు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల గేట్ల వద్దే నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
జీవో 97ను రద్దు చేయాలి
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 59 ప్రభుత్వ, 97 ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా పాలిటెక్నిక్ విద్యను ఐటీఐ, స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం సరికాదన్నారు.
దీంతో విద్యార్థులు నేరుగా బీటెక్‌లో చేరే అవకాశాన్ని కోల్పోతారని, ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో 400 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ వ్యవస్థను కాపాడాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్య విధానాల వల్ల సామాన్యులు, కూలీల పిల్లల విద్య ప్రశ్నార్థకంగా మారుతోందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

