కలం, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై వస్తున్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా సభకు హాజరుకావడం ఆయన కనీస బాధ్యత అని, అందులో గొప్ప విషయమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్‌ను (Nitin Nabin) మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రామచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. నీళ్ల విషయంలో రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని, ఇప్పుడు అంశాలు లేక సెంటిమెంట్‌ను రగుల్చే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డీపీఆర్ వెనక్కి పంపారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, కేంద్రం కేవలం కొన్ని అంశాలపై స్పష్టత మాత్రమే కోరిందని ఆయన వివరించారు.
అసెంబ్లీని కేవలం రెండు మూడు రోజులు మాత్రమే నడుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. ప్రజల సమస్యలపై చర్చ జరగాలంటే సభను కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్, జలాల సమస్యను పరిష్కరించకుండా కేవలం రాజకీయం మాత్రమే చేశారని ఎద్దేవా చేశారు. కేంద్రం జోక్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన జాతీయ ప్రాజెక్టులను వద్దని కోరుకున్నారని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ గణనీయంగా బలోపేతం అవుతోందని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి అనుకూలమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా ఉన్నామని స్పష్టం చేశారు. లీక్ వీరులు తరువాత వీక్ అవుతారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నితిన్ నబిన్ సైతం రిపోర్టుల ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Read Also: సర్పంచ్ చెక్ పవర్ పై ప్రభుత్వం కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)


