కలం, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో వివాదానికి దిగిన టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోలపై (Asitha Fernando) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది.
కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. భారత తొలి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌ను అసిత ఫెర్నాండో బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో జైస్వాల్ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం ఫెర్నాండో యానిమేటెడ్‌గా జైస్వాల్‌కు వీడ్కోలు పలకడంతో భారత బ్యాటర్ వెనక్కి తిరిగి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వారి హెల్మెట్లు, తలలు తగిలాయి. వెంటనే సహచర ఆటగాళ్లు, శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు.
సోషల్ మీడియాలో స్పందించిన జైస్వాల్
ఈ ఘటనపై జైస్వాల్ (Yashasvi Jaiswal) సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాము ఏం మాట్లాడుకున్నామో తెలియకుండా తనపై తీర్పు ఇవ్వొద్దని అభిమానులను కోరాడు. మ్యాచ్‌లో చోటుచేసుకున్న పరిణామాల పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోవాలని సూచించాడు. భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. మ్యాచ్ వేడి సమయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని పేర్కొన్నాడు. అయితే ఫెర్నాండోకు జైస్వాల్ భౌతికంగా అంత దగ్గరగా వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం చర్యలు
జైస్వాల్, ఫెర్నాండో ఇద్దరూ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించారు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 కింద లెవల్-1 ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకుంది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
Also Read : ఏషియన్ గేమ్స్ ఎంపికపై బోపన్న గుర్రు!
Follow Us On: Instagram

