కలం, మెదక్ బ్యూరో: తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో దారుణంగా హత్య చేసిన కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన యువతి, తిరిగి అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి (Sangareddy ) పట్టణంలో వెలుగుచూసింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామానికి చెందిన నక్కలి సురేఖ( 25) సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు హస్పిటల్‌లో నర్సుగా పని చేస్తుండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులు నక్కలి దశరథ్, లక్ష్మికి వివరించింది. వారు ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులపైనే కక్ష పెంచుకుని, వారిని అడ్డు తొలగించుకుని, ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.
మోకాళ్ల నొప్పులకు అంటూ..
అందులో భాగంగా మోకాళ్ల నొప్పుల మందుల పేరుతో వారికి హై-డోస్ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దారుణంగా హత్య చేయడానికి ప్లాన్ వేసింది. ఈ ఏడాది జనవరి 25న ఇంటికి వెళ్లిన సురేఖ.. తల్లిదండ్రులను నమ్మించి ఇంజిక్షన్ వేసింది. తల్లి లక్ష్మి స్పృహ తప్పి పడిపోగా.. తండ్రికి కూడా ఇచ్చింది. ఇద్దరూ కుప్పకూలిన తరువాత అప్పుల బాధతో చనిపోయారంటూ.. అందరినీ నమ్మించింది. ఇంట్లో రక్తపు సిరంజీలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మానసిక ఒత్తిడితో..
విచారణలో సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా విచారించగా అసలు విషయం బయటపడింది. తన ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, మోకాళ్ల నొప్పుల మందుల పేరుతో వారికి హై-డోస్ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్టు అంగీకరించింది. అనంతరం జైలుకు వెళ్లి.. ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. కన్న తల్లిదండ్రులనే చంపానన్న నింద ఎప్పటికీ పోదనే భావనతో, గడిచిన నెల రోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. చివరకు సూసైడ్ లెటర్ రాసి, తల్లిదండ్రులను హత్య చేసేందుకు వాడిన మత్తు ఇంజిక్షన్‌నే తనకు తాను ఇచ్చుకుని ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
సురేఖ తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకునేముందు ఒక సూసైడ్ నోట్ రాసింది. ‘నాకు బతకాలని, ఎంజాయ్ చేయాలని, అందరితో సంతోషంగా ఉండాలని ఉండేది. కానీ దేవుడు ఆ రాత రాయలేదు. బతకాలనే ఆశ మొత్తం పోయింది. బతికి ఏం లాభం లేదు . అందుకే చనిపోవాలని ఫిక్స్ అయ్యాను. కాబట్టి చనిపోతున్నా. నా చావుకు కారణం ఎవరూ లేరు. చనిపోవాలని ఒక నెల నుంచి అనిపిస్తోంది. ఈ రాఖీ పండుగకు అన్నకి రాఖీ కట్టలేకపోయా. ఐ మిస్ యూ అన్న బంగారం. ఆరోగ్యం మంచిగా చూయించుకో అన్నయ్య. నువ్వు సంతోషంగా ఉండు. నా చావుకు కారణం ఎవ్వరూ లేరు. నేను చనిపోయాను’ అని చివరిగా సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది .
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరణ..
సంగారెడ్డి హస్టల్ లో సురేఖ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి, స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. సురేఖ కన్నవాళ్లనే హత్య చేయడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పూర్తిగా దూరం పెట్టారు. దీంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోనే రోజంతా భద్రపరిచారు. చివరకు పోలీసులు కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో మాట్లాడి మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామం తీసుకెళ్లేలా చొరవ చూపారు. కన్నవారిని పొట్టన పెట్టుకున్న పాపం, కోరుకున్న విధంగా ప్రేమ పెళ్లి కాకపోవడం, జైలు జీవితం, సమాజం-కుటుంబం దూరం పెట్టడంతో పెరిగిన ఒంటరితనం, మానసిక వేదనతోనే సురేఖ జీవితం ఆత్మహత్యతో ముగిసింది.

