కలం, నిజామాబాద్ బ్యూరో : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సునీల్ కుమార్ రెడ్డి, విపుల్ గౌడ్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. క్రింది స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్ వస్తోందని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామని చెప్పారు. 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్‌చార్జితో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధానం కూడా ఇదే ఫార్మాట్‌లో ఉందన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వారికి పదవుల్లో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
NSUI, యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అన్ని కమిటీలను భర్తీ చేస్తామని, ఇందులో 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. “అధికారం కార్యకర్తల కృషి వల్లే వచ్చింది. కార్యకర్తల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మరచిపోదు” అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా తన 35 ఏళ్ల కల అయిన ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల సాకారం అయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

