కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ , సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల నియామక పరీక్షలకు సిద్ధం కావడానికి ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని (Free Coaching) నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతకు ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన శిక్షణ అవసరమైన మార్గదర్శకత్వం అందించడమే పోలీస్ కమిషనరేట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణ
ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మూడు డివిజన్లలోని నిజామాబాద్ డివిజన్‌కు మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్‌కు క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్‌కు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షా ప్రక్రియ సజావుగా , పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించారు.
స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్ష , ఫిజికల్ ఈవెంట్స్ తదితర అంశాల్లో సమగ్ర శిక్షణ , మార్గదర్శకత్వం అందించనున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని , క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలని సీపీ సాయి చైతన్య ఆకాంక్షించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సీటీసీ , ట్రాఫిక్ , సీసీఎస్ , ఏఆర్ , టాస్క్‌ఫోర్స్ , స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన ఏసీపీలు , ఇన్స్పెక్టర్లు , సీఐలు , ఎస్. హెచ్.ఓ లు , ఎస్ఐలు , ఐటీ కోర్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది పరీక్ష నిర్వహణలో పాల్గొన్నారు.

