తెలంగాణలో జనసేన దూకుడు.. పట్టభద్రుల MLC అభ్యర్థి ఫిక్స్!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో జనసేన (Janasena) పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఏవైనా సరే.. ఫలితాలతో సంబంధం లేకుండా పోటీచేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు (Dr Gadala Srinivasa Rao) పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది.

వైద్య ఆరోగ్య రంగంలో సేవలు..

ప్రస్తుతం డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో ఆయన సేవలు అందించారు. జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గడల శ్రీనివాసరావు పేరును.. పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.

పవన్ కళ్యాణ్​ సుముఖత..

డాక్టర్ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో, ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) పేరును జనసేన పార్టీ ముందస్తుగా ప్రకటించింది. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలి వేదికగా బలంగా వినిపిస్తానని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 13న ఖమ్మంలో భారీ సభ..

​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస రావు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 13న ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలతో ‘జనసేన శంఖారావం’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బరిలోకి దిగుతుందన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జనసేన మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కించుకోవడం ఏ పార్టీకీ సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 29 లేదా అక్టోబర్ 2న హైదరాబాద్‌లో సుమారు 5 వేల మంది యువతతో సమర భేరి మోగించనున్నట్లు వెల్లడించారు.

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం..

ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని గడల శ్రీనివాస రావు మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు పనులు, నిరుద్యోగ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రైతులకు ఎదురవుతున్న ఎరువుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయానికి ఏళ్ల తరబడి పాలకవర్గాన్ని నియమించకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో జనసేనను ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో పాత వారికే పెద్దపీట.. 100 సీట్లే లక్ష్యం: టీపీసీసీ చీఫ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>