కలం, వెబ్ డెస్క్ : భారతీయ రైల్వేలకు చెందిన ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్స్ దుర్వినియోగం (Railway Bedsheet Theft) అవుతున్న తీరు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ముగ్గురు వ్యక్తులు ‘వెస్టర్న్ రైల్వే’ అని స్పష్టంగా రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాల్లా కప్పుకుని మార్కెట్‌లో ఏమాత్రం సంకోచం లేకుండా షాపింగ్ చేస్తూ కనిపించారు. రైలు ప్రయాణంలో సౌకర్యం కోసం ఇచ్చిన ప్రభుత్వ ఆస్తిని ఇలా బహిరంగంగా వ్యక్తిగత దుస్తులుగా వాడుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఒక్క వీడియోతో వెలుగులోకి వచ్చిన ఉదంతం భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న భారీ నష్టానికి చిన్న ఉదాహరణ మాత్రమేనని సమాచార హక్కు చట్టం డేటా ద్వారా స్పష్టమవుతోంది. జనవరి 2022 నుండి మే 2026 మధ్య కాలంలో దాదాపు 1.27 కోట్లకు పైగా బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురైనట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో లక్షలాది దుప్పట్లు, చేతి తువాళ్లు, దిండు ముసుగులు, కంబళ్ళు, దిండ్లు ఉన్నాయి. ప్రయాణికులు వీటిని తమతో పాటు ఇళ్లకు పట్టుకుపోవడం వల్ల రైల్వే శాఖకు సుమారు 104.51 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని సమాచారం.
రైలు ప్రయాణం పూర్తి చేసుకుని దిగే సమయంలో లగేజ్ తనిఖీలను విస్తృతం చేయడం లేదా బెడ్‌రోల్స్ ఇచ్చే ముందే ప్రయాణికుల నుంచి కొంత డిపాజిట్ మొత్తాన్ని తీసుకుని, తిరిగి ఆ వస్తువులను సమర్పించిన తర్వాతే ఆ డిపాజిట్ వెనక్కి ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల ఇలాంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

