కలం, నిర్మల్: తానూర్ మండలం హంగిర్గ గ్రామ అభివృద్ధికి సుమారు రూ.1.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు (Pawar Ramarao Patel) పటేల్ తెలిపారు. దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, కళ్యాణ మండపం, అంగన్వాడీ, వీవో, గ్రామపంచాయతీ భవనాలతో పాటు హిప్నెల్లి నుంచి సరస్వతి నగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. తానూర్ మండలానికి సంబంధించిన 27వ ప్యాకేజీ పూర్తి చేసేందుకు రూ.700 కోట్లకు పైగా అవసరమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

