కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ (Narayanpoor) గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం గంగాధర (Gangadhara)లో ఆందోళనకు దిగారు. జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీగా చేరుకున్న గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తమ పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి తదితరులు మద్దతు పలికారు.
పోలీసులతో తోపులాట.. ఉద్రిక్తత
ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనలు, పోరాటాలు చేస్తూనే ఉంటాం..
పోలీసులు, మహిళా ఆందోళనకారుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసుల లాఠీచార్జ్‌లో షహీనా అనే మహిళ కాలు విరిగిందని, మరో మహిళ స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మద్దతిచ్చిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించే వరకు తమ ఆందోళనలు, పోరాటాలు కొనసాగుతాయని గ్రామస్తులు స్పష్టం చేశారు.

