కలం, ఖమ్మం బ్యూరో : ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, “కాంగ్రెస్ పార్టీ అంటేనే కబ్జాలు” అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తప్పులు చేసి కేవలం క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రజలు ఈ చర్యలను ఎలా సహిస్తారని ఆయన నిలదీశారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ‘భూభారతి’ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పువ్వాడ ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం క్షమాపణలు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 22A నిషేధిత భూముల జాబితాలో గతంలో 8 నుంచి 9 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏకంగా కోటి ఎకరాలకు ఎలా చేరుకున్నాయో ప్రభుత్వం ప్రజలకు వెంటనే స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే, రైతు రుణమాఫీ వంద శాతం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న ప్రకటనలను పువ్వాడ కొట్టిపారేశారు. రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయిందనేది నిజమైతే, నిరూపించడానికి రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వచ్చి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి తుమ్మలకు సవాల్ విసిరారు. తన అంతు చూస్తానంటూ మంత్రి వ్యాఖ్యలు చేయడం కాదని, ముందుగా ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం ఉందో లేదో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తీవ్ర నీటి కొరత, సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనీసం ఈ అంశంపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు (Sita Rama Project) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, రాజీవ్ సాగర్ నిర్మాణం పూర్తయిన ఏడాదికే లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
ఎన్నికల సమయంలో నెరవేర్చలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పేదల ఇళ్లను కూల్చేస్తూ వారి పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 23 ఎకరాల ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, కేబినెట్ ఆమోదంతో జీవో కూడా జారీ చేయించానని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ విలువైన స్థలాలను జర్నలిస్టులకు కేటాయించకుండా వారిని దారుణంగా మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, రైతుల సమస్యలు, పేదల ఇళ్లు జర్నలిస్టుల సంక్షేమం వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) డిమాండ్ చేశారు.
Also Read : ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

