కలం, వెబ్ డెస్క్: నిషేదిత భూముల (Prohibited Lands) జాబితాలోప్రైవేట్ ఆస్తులు నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ లలో సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా పేరుతో రాష్ట్ర ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ సర్కార్ 30 శాతం కమీషన్ తీసుకునే సర్కార్ అని ప్రజలే అంటున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా హైదరాబాద్ లోని బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22A బాధితులు.. హరీశ్ రావు వద్ద తమ గోడునువెళ్లబోసుకున్నారు .
ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పారు. ఆ ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌లో ఉందని చెబుతున్నారని, దీంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని.. ప్రజలలో అల్లర్లు చెలరేగి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని ప్రజలే అంటున్నారని విమర్శించారు.
దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు.. 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని.. దీనికి మీ సమాధానం ఏమిటి రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు. సర్కార్ వెంటనే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!
Follow Us On: X(Twitter)

