సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలు కొనసాగించాలి: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: పేద ప్రజల పక్షపాతిగా అలుపెరగని పోరాటాలు చేసి కార్మికుల, కర్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన గొప్ప మేధావిగా, కమ్యూనిస్టు యోధుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీపీఐ అగ్ర నేత (CPI Leader).. సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) అని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) కొనియాడారు.

శనివారం కరీంనగర్‌ (Karimnagar) లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబమంతా కమ్యూనిస్టు భావజాలం, అభ్యుదయ భావాలతో నిండి ఉందని అన్నారు.

ఆయన పెద్దనాన్న సురవరం ప్రతాప రెడ్డి నిజాం కాలంలో తెలుగు సాహిత్యంతో గోల్కొండ పత్రికను స్థాపించారని, సాయుధ పోరాట సమయంలో ఆయన కుటుంబమంతా పోరాటంలో పాల్గొన్నదని, ఆయన వారసత్వాన్ని సుధాకర్ రెడ్డి పుణికిపుచ్చుకున్నారని తెలిపారు. విద్యార్థి దశలోనే ఏఐఎస్ఎఫ్ నాయకునిగా ప్రస్థానం ప్రారంభించిన సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి, యువజన సంఘాలకు రాష్ట్ర, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారని పేరొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శిగా పనిచేసి నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించే నాయకునిగా ఎదిగారని, కరువుకు నిలయమైన రాష్ట్రంలో సాగు, త్రాగు నీరు కోసం జరిగిన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా జరిగిన ఉద్యమంలో బాష్పవాయువు, లాఠీచార్జీలు, ఫైరింగ్‌కు కూడా ఆయన బెదరకుండా ముందుండి నిలిచారని గుర్తు చేశారు. ప్రజాపోరాటాలలో పార్లమెంటరీ వ్యవస్థలలో పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడిన నిబద్ధతగల కమ్యూనిస్టు అగ్ర నాయకునిగా ఎదిగారన్నారు.

2004లో యూపీఏ వన్ ప్రభుత్వ హయంలో ఆయన నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాల్లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం వెలికి తీయడం, కోట్ల రూపాయల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయని పార్లమెంట్‌లో లేవనెత్తిన గొప్ప మేధావి అని అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కార్మికులకు అండగా నిలిచారని, వారి హక్కులను కాపాడారని, చట్టాలను రక్షించారని గుర్తుచేశారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం, సమాచార హక్కు చట్టం, భూ సంస్కరణల చట్టం అమలు చేయడంలో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారని, అనారోగ్యంతో ఉన్నా కూడా పార్టీ కార్యక్రమాల్లో బహిరంగ సభల్లో, సెమినార్లలో పాల్గొనే వారని, అలాంటి గొప్ప వ్యక్తి సురవరం అని కొనియాడారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం కమ్యూనిస్టులు సిద్ధం కావాలని చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, బామండ్లపెల్లి యుగేందర్, మచ్చ రమేష్, దుడ్డేల సమ్మయ్య, బోనగిరి మహేందర్, బూడిద సదాశివ, పిట్టల శ్రీనివాస్, నాయకులు నునావత్ శ్రీనివాస్, అల్లేపు రాజు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Also Read : పొంగులేటి పర్యటన.. నిజామాబాద్‌లో ఉద్రిక్తత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>