పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం : మహేష్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో : పేదల జీవిత స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అదనంగా నిజామాబాద్ జిల్లాకు మరిన్ని ఇళ్లు మంజూరు చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

పేదల మేలు కోరే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కవిత, పట్టణ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>