కలం, ఖమ్మం బ్యూరో: తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, వరుస చోరీలకు పాల్పడుతున్న నేరస్థుడుని ఖమ్మం జిల్లా తల్లాడ పోలీసులు (Khammam Police) అరెస్ట్ చేశారు. రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వైరా సీఐ వెంకటప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. జంగాల స్వరూప్ కుమార్ (అలియాస్ శాంతి స్వరూప్, వినయ్ కుమార్) గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నాడు. తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు కూడా.
గత ఏప్రిల్ 11న గంగదేవిపాడు గ్రామానికి చెందిన సిలివేరు నరసింహారావు కుటుంబసభ్యులతో బయటకు వెళ్లాడు. అదే సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టాడు. బీరువాలో బంగారు ఆభరణాలను దొంగిలించాడు. మరో ఇంట్లోనూ బంగారు ఉంగరాలను చోరీ చేశాడు. ఆ ఉంగరాలను గన్నవరంలోని బంగారం షాప్‌లో విక్రయించాడు.
విచారణలో నిందితుడికి పలు చోరీ కేసులతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై నమోదైన పాత కేసుల వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని నేరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

