కలం, మంచిర్యాల: ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జన్నారం మండలం లింగయ్యపల్లి (Lingayyapalli)కి చెందిన సందేవేని తిరుపతి నూతన ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని సంప్రదించారు. అనుమతి ఇవ్వాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చివరకు రూ.13 వేలకు బేరం కుదిరింది. నగదు రూపంలో తీసుకునేందుకు నిరాకరించిన కార్యదర్శి ఫోన్ పే ద్వారా తన స్నేహితుల ఖాతాలకు బదిలీ చేయాలని సూచించారు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. డీఎస్పీ మధు ఆధ్వర్యంలో పక్కా ప్రణాళిక వేశారు. తిరుపతి రూ.13 వేలను ఫోన్ పే ద్వారా బదిలీ చేసిన వెంటనే పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

