కలం, నల్లగొండ: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) జలాల విషయంలో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కృష్ణా జలాల తరలింపు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. సాగర్ ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయమని అన్నారు.
నాగార్జునసాగర్‌లో తగినంత నీటి మట్టం అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత రైతులకు జీవనాధారమైన ఎడమ కాల్వకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో వరుసగా 17 పంట కాలాలలో ఆయకట్టు రైతులకు సమర్థవంతంగా సాగునీరు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో సాగర్‌లో నీళ్లున్నా ఎడమ కాల్వకు నీరు విడుదల చేయకుండా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని విమర్శించారు.
సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. నీళ్లు ఇచ్చి తీరాల్సిందే అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఇకనైనా మేల్కొని తమ హక్కులైన సాగునీటి కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రైతుల తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు.

