మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు 38మందిపై కేసులు

కలం, నాగర్ కర్నూల్ : అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు, మరో 38 మందిపై కేసు నమోదైంది. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు.

దీంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చే క్రమంలో కార్యాలయ గేటును తోసుకుంటూ పార్టీ నాయకులతో కలిసి మర్రి ఆవరణ లోపలికి వెళ్లారు. కొద్ది మందికి మాత్రమే ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచించగా పార్టీ శ్రేణులు అధికంగా ఉండడంతో ఆ నిబంధనలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో సిఐతో పాటు పోలీసులతో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి.

కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం సైతం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ధర్నా నిర్వహించారని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు మరి జనార్దన్ రెడ్డితో పాటు పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో తాడూరు మండలం సిర్సవాడలో పాఠశాల ప్రారంభోత్సవ సందర్భంగా కేసు నమోదు అయింది.

ఈ ఏడాది మర్రి జనార్దన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని కొద్దిమంది అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు అనుచరులపై మూడోసారి కేసులు నమోదు కావడం గమనార్హం. నాగర్ కర్నూల్ రాజకీయ చరిత్రలో ఇలా పెద్దమొత్తంలో పోలీసులు కేసులు నమోదు చేయడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>