యువతను దేశ నిర్మాణ శక్తిగా చూడాలి: ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్: యువత, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర యువజన విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ( AIYF Karimnagar) జిల్లా ప్రధాన కార్యదర్శి భావండ్లపల్లి యుగంధర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పోలోజు రంజిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన విద్య, శాశ్వత ఉపాధి, అందుబాటు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన వార్షిక క్యాలెండర్, పెండింగ్ నియామకాల పూర్తి, జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రైవేట్, కాంట్రాక్ట్, గిగ్ రంగాల్లో పనిచేస్తున్న యువతకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. యువత, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం, ఫీజుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో జాప్యం, పేపర్ లీకులు, నిరుద్యోగ పోటీ పరీక్షల కోసం ఖరీదైన కోచింగ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ముగించాలని అన్నారు.

ప్రతి జిల్లాలో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, విద్యార్థి హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను బలోపేతం చేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం, నీటి వనరులు, పరిశ్రమలు, సేవారంగం ఆధారంగా స్థానిక ఉపాధిని విస్తరించి యువత హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని మార్చాలని కోరారు. యువతను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకునే రాజకీయాలకు ముగింపు పలకాలన్నారు . యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే పాలన కావాలన్నారు.

విద్య, ఉపాధి, సామాజిక న్యాయం హామీలు కాదు.. అవి యువత హక్కులు అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోసుల సంతోస్ చారి, ఉపాధ్యక్షులు చంచల మురళి, సహాయ కార్యదర్శులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, చెంచల రవి, కోశాధికారి పెనుమల్ల విజయభాస్కర్, జువ్వాజి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>