కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్‌ను (Mahabubnagar) రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ నగరం తెలంగాణ విద్య, సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ నిధులు రూ7.95 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ ఎంవీఎస్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (మార్కెట్ రోడ్) భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు.
అనంతరం (MLA Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. విద్య ధనవంతులు, ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే పరిమితం కాకూడదని, పుట్టిన ప్రతి బిడ్డ ఎక్కడ, ఏ కుటుంబంలో పుట్టాడనే తేడా లేకుండా అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినట్లవుతుందని పేర్కొన్నారు. గతంలో విద్యారంగంపై జరిగిన నిర్లక్ష్యం, వివక్ష కారణంగా ఎంతోమంది పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని యెన్నం తెలిపారు. త్వరలోనే మహబూబ్‌నగర్‌కు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రాబోతోందని, ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల నిధులు సమకూరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో నిలిచిపోయిన మైనార్టీ విద్యాసంస్థల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని తెలిపారు.
మహబూబ్‌నగర్ నగరానికి రెండు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలను తీసుకువచ్చామని, ఇందుకోసం రూ.50 కోట్ల నిధులు సమకూరనున్నాయని, వీరన్న పేటలో ఏర్పాటు చేయనున్న ఈ విద్యాసంస్థలకు త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, దసరా అనంతరం భూమిపూజ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
గత రెండున్నర యేండ్లలలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెచ్చిన నిధులు గురించి వివరిస్తూ, పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తీసుకువచ్చి ఇంజనీరింగ్, లా కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మహబూబ్‌నగర్‌కు ట్రిపుల్ ఐటీ తీసుకురావడంలో ప్రత్యేకంగా కృషి చేశామని, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారని చెప్పారు.
భవిష్యత్తులో ఈ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి సొంత సంస్థలు స్థాపించేలా అవసరమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ.600 కోట్ల నిధులు మంజూరు చేయించామని, మొదటి దశలో రూ.200 కోట్ల పనులకు త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని యెన్నం అన్నారు. యంత్రాలతో పోటీ పడే పరిస్థితుల్లో మనిషి తన మేధోశక్తి, సృజనాత్మకత, నైపుణ్యాలతో ముందుండాలంటే విద్యార్థులను ఇప్పటి నుంచే అందుకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారితే ఇక్కడి విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, నగరానికి సానుకూలమైన విద్యా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో పత్రికా మిత్రులు సామాజిక బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, సోషల్ మీడియా కన్వీనర్ సిజే బెనహర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, నాయకులు మైత్రి యాదయ్య, రమేష్ రెడ్డి, గోవర్థన్ గౌడ్, కార్పొరేటర్లు జి.రాధ గోవర్థన్ గౌడ్, సిబి పూజిత, సువర్ణ కిషన్ నాయక్, వరలక్ష్మి, తాహెర్, ఉమర్ కొత్వాల్, ఫయాజ్, డిఐఈఓ రమణి, ఎంవీఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భీంరెడ్డి, డిఇఓ ఐ. విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.

