కలం, ఖమ్మం బ్యూరో: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీజీ జేఏసీ (TG JAC) ఆధ్వర్యంలో ఈనెల 27న ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి జరగనుంది. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఏన్కూరు మండలంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గత జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ, రెండు నెలలైనా ప్రధాన డిమాండ్లు నెరవేరలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలన్నారు. రెండవ పీఆర్సీ నివేదికను ప్రకటించి, పెండింగ్ 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ వర్తింపజేయాలని, జీవో 25ను సవరించి బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. ఆగస్టు 27న జిల్లా ధర్నాలు, సెప్టెంబర్ 1న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, సెప్టెంబర్ 10న హైదరాబాద్ మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రహీం బీ, వాసవి దేవి, సుజాత, టీచర్లు శ్రీదేవి, రమేశ్, రామారావు పాల్గొన్నారు.

