కలం, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో అసలు నిజం అందరికీ తెలిసిపోయిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో అర్థమైందన్నారు. రూ.40 కోట్లు సుపారీ ఇచ్చిందెవరో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చెప్పాలని జగన్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. నిజం నిప్పు లాంటిదని.. ఎప్పటికైనా వాస్తవాలు బయటకు రావాల్సిందేనన్నారు. వివేకా హత్య కేసులో తనను ఇరికించాలని సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర పేరిట అబద్ధపు కథనాలు ప్రచురించారని మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో కూడా అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్–1 కుంభకోణంపై ఎందుకు జగన్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీమలో కరువు సమస్యకు చెక్..
గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తేనే నీటి సమస్యలు తీరుతాయని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఇంతటి కరువు పరిస్థితుల్లో కూడా సుమారు 200 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా వెళ్లిపోయాయన్నారు. అవే నీళ్లు రైతుల పొలాల్లోకి వస్తే ఎంతో ఆర్థిక లబ్ధి చేకూరేదన్నారు. గోదావరి, కావేరి అనుసంధానం కనుక పూర్తయితే రాయలసీమలో ఇక కరువు సమస్యనే ఉండదన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకాల ద్వారా రూ.30 వేల కోట్లతో తాగునీటి సమస్య పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు.

