కలం వెబ్ డెస్క్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పాలక, ప్రతిపక్ష వర్గాలు సభకు ప్రణాళికలతో సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఓ మంత్రి అసెంబ్లీలో ఎంట్రీకి అర్హత కలిగి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్(Mohammed Azharuddin) గత అక్టోబర్ 31న తెలంగాణ మంత్రివర్గంలో చేరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయించారు. కానీ, అసెంబ్లీకి మాత్రం అజార్‌కు ప్రవేశం లేదు.
అజారుద్దీన్ ప్రస్తుతం అసెంబ్లీలో, కౌన్సిల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నియమాల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లో తప్పనిసరిగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవ్వాలి. లేదంటే ఉన్న మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వస్తుంది. అజారుద్దీన్ 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆయనపై బీఆర్ఎస్(BRS) అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అనంతరం అజారుద్దీన్‌ను (Azharuddin) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ(MLC)గా నామినేట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, దానికి ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. మరోవైపు అజారుద్దీన్ ఏప్రిల్ చివరికల్లా ఎమ్మెల్సీ అయితేనే తన మంత్రి పదవి కాపాడుకోగలరు. అప్పటిలోగా కేసులు అన్ని దాటుకొని గవర్నర్ ఆమోద ముద్రతో పదవి వరిస్తుందా? లేక ఏకంగా మంత్రి పదవినే కోల్పోతారా అన్నది? చర్చనీయాంశంగా మారింది.
Read Also: పొలిటికల్ ప్రెజర్ వల్లే శుబ్‌మన్ గిల్‌కు ఛాన్స్ దక్కలేదా?
Follow Us On: Pinterest


