epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవిత ఆన్ ఫైర్.. కేటీఆర్ కౌంటర్ స్ట్రాటజీ!

కలం డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కల్వకుంట్ల కవిత (Kavitha) తనకంటూ సొంత ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకుని జనం బాట పట్టారు. అకారణంగా సస్పెండ్ చేశారని ఏకరువు పెడుతూనే జనం జాగృతి పేరుతో ప్రజా సమస్యలపై జిల్లాల పర్యటన చేస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తచూపుతున్నారు. ఆమె లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చుకోక తప్పడంలేదు. జిల్లాల పర్యటన సందర్భంగా టేకప్ చేసిన ఇష్యూస్‌ బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెడుతుండడంతో దాన్ని ఆ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి కేటీఆర్, హరీశ్‌రావు రోడ్డెక్కక తప్పడంలేదు. పార్టీకి సంకటంగా మారడంతో నేరుగా ఆమెను విమర్శించే సాహసం చేయలేక ఆమె ప్రస్తావించిన అంశాలను పార్టీపరంగా అడ్రస్ చేయడానికి వారిద్దరు రంగంలోకి దూకక తప్పడంలేదు.

పత్తి రైతుల కష్టాలు… :

కాటన్ కార్పొరేషన్ పెడుతున్న ఆంక్షలతో రైతులు కష్టపడి పండించిన పత్తి పంటను మార్కెట్‌లో అమ్ముకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పష్టమైన హామీని ఇవ్వలేకపోవడంతో కవిత ఆ అంశాన్ని టేకప్ చేశారు. నవంబరు 4న ఆదిలాబాద్ పత్తి మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించి 20% తేమ ఉన్నా పూర్తిగా కొనాలని డిమాండ్ చేశారు. కవిత అడ్వాన్స్ అవుతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్.. వెంటనే కేటీఆర్, హరీశ్‌రావును రంగంలోకి దించింది. నవంబరు 17న హరీశ్‌రావు వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఆ మరుసటి రోజున కేటీఆర్ ఆదిలాబాద్ మార్కెట్‌కు వెళ్ళి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

సింగరేణి ఉద్యోగాలపైనా.. :

సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశంలోనూ కవిత తొలుత స్పందిస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అదే అంశాన్ని టేకప్ చేశారు. సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, వారసత్వ ఉద్యోగాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ఎదుట నవంబరు 19న ధర్నా చేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. దాదాపు నెల రోజుల తర్వాత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు కలిసి అదే సింగరేణి భవన్ దగ్గర డిసెంబరు 27న ధర్నా చేశారు. ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు.

తాజాగా నాగర్‌కర్నూల్ టూర్ :

నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వట్టెం రిజర్వాయర్‌ను, ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు బీఆర్ఎస్ పాలనలో న్యాయం జరగలేదన్న అంశాన్ని ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించినట్లుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ (KCR) వ్యవహరించి ఉంటే నీటి దోపిడీకి తావుండేది కాదని, ఏపీతో జల వివాదం ముదిరేది కాదన్నారు. కేసీఆర్ మౌనంగా ఉన్నందున ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి రెట్టింపు కెపాసిటీతో నీళ్ళను తీసుకెళ్ళడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగాయని ఆరోపించారు. ఆ మరుసటిరోజునే కేటీఆర్ ఆ జిల్లా పర్యటనకు వెళ్ళి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ను అభినందించారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు జరిగిన లబ్ధి గురించి ఏకరువు పెట్టారు.

చెల్లెలి దారిలో అన్న .. :

జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత (Kavitha) బీఆర్ఎస్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేస్తుండడంతో కేడర్‌లో తలెత్తే కన్‌ఫ్యూజన్‌ను తొలగించేందుకు డ్యామేజ్ కంట్రోల్ ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. కొన్ని చోట్లకు కేటీఆర్, మరికొన్నిచోట్లకు హరీశ్‌రావు వెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఎత్తుగడలు, బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటెజీలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: ఓడిపోయి కేసీఆర్ లాగా ఫామ్ హౌస్‌లో పడుకోవద్దు: మంత్రి కోమటిరెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>