కలం, వెబ్ డెస్క్: మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే (Telangana police) మోసపోయారు. బెట్టింగ్ యాప్ (Betting Apps) కేసుల్లో కొన్ని చోట్ల పోలీసులే బాధితులయ్యారు. తక్కువ సమయంలో అధిక డబ్బు వస్తుందని ఆశపడి సర్వం కోల్పోయారు. ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఏడాది అంటే 2025లో ఇటువంటి ఘటనలు ఎక్కువ సంఖ్యలో వెలుగు చూశాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పోలీసులను కూడా మోసం చేశారంటే వారు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.
అప్పుల పాలై ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్‌లో మోసపోయి ప్రాణాలు తీసుకున్నాడు. 2024 బ్యాచ్ కానిస్టేబుల్ సందీప్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. బంధువులు, స్నేహితుల నుంచి లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పుల ఒత్తిడికి తట్టుకోలేక నవంబర్ 3, 2025న మహబూబ్‌సాగర్ చెరువు ఒడ్డున తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సర్వీస్ రివాల్వర్ తాకట్టు
అంబర్పేట్ (హైదరాబాద్) సబ్-ఇన్స్పెక్టర్ భాను ప్రకాశ్ ఆన్లైన్ బెట్టింగ్‌లో (Betting Apps) సుమారు రూ.80 లక్షలు నష్టపోయాడు. అప్పులు తీర్చడానికి తన సర్వీస్ ఆయుధాన్ని తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. సీనియర్ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
భారీగా నష్టపోయిన రిజర్వ్డ్ కానిస్టేబుల్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్ మెన్ కృష్ణ చైతన్య ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బు నష్టపోయి, కుటుంబ సభ్యులతో గొడవలు పడ్డాడు. డిసెంబర్ 2025లో (ఇటీవల) తుపాకీతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్‌లో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్, మధురానగర్ పీఎస్‌లో ఓ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్‌లో తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారు.
Read Also: క్లీన్ సిటీ కోసం ‘మెగా డ్రైవ్’.. రేపటి నుంచే ప్రారంభం
Follow Us On: Instagram


