కలం వెబ్ డెస్క్ : బిజీ బిజీ జీవితాలతో సతమతమవుతున్న ప్రజలు కాస్త సమయం దొరికితే కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవలి క్రిస్మస్‌తో పాటు వచ్చిన వరుస సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక ప్రాంతాలకు(Tourist Places) క్యూ కడుతున్నారు. ఈ వరుస సెలవులు, సమీపిస్తున్న న్యూ ఇయర్(New Year) సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయ(Araku Valley) పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఘాట్ రోడ్డంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. అలాగే స్థానికంగా హోటల్స్ అన్నింటిలో దాదాపు మరో పది రోజుల వరకు బుకింగ్స్ పూర్తయ్యాయి.
చలి కాలంలో సాధారణంగానే అరకు (Araku Valley) అందాలు చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నూతన సంవత్సరం దగ్గర పడుతుండటంతో ఈ సంఖ్య కాస్తా డబుల్ అవుతోంది. ఇక్కడి ఉడెన్ బ్రిడ్జికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేకంగా దీన్ని చూసేందుకు కూడా చాలామంది వస్తున్నారు. పర్యాటకుల రద్దీతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ దృష్ట్యా కొత్తగా వాహనాలను అనుమతించడం లేదు. అలాగే ఉడెన్ బ్రిడ్జికి వస్తున్న పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అనుమతించనున్నట్లు ప్రకటించారు. పర్యాటకుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక స్థానికంగా లంబసింగి, బొర్రా గుహలు, జలపాతాలు, కాఫీ తోటలు, వంజంగి హిల్స్ తదితర ప్రాంతాల్లో సైతం పర్యాటకుల రద్దీ తీవ్రంగా ఉంది.
Read Also: అమ్మో… ఏడాదిలో ఇంత బంగారం కొన్నారా?
Follow Us On: Pinterest


