నల్లగొండలో అంతర్‌రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.. రూ.2 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం!

కలం, నల్లగొండ: విలువైన మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్‌రాష్ట్ర దొంగను నల్గొండ (Nalgonda)  టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, సత్యనారాయణపురం పరిధిలోని గులాబీ తోటకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ (44) చికెన్ షాప్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. జాలీ జల్సాలు, దురలవాట్లకు బానిసైన ఇస్మాయిల్ గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడి చర్లపల్లి జైలులో ఒక సంవత్సరం శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన వైఖరి మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన నల్గొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు నిలిపి ఉంచిన హోండా షైన్ మోటార్ సైకిల్‌ను దొంగిలించాడు. శనివారం ఉదయం 6 గంటలకు నల్గొండలోని పానగల్ బైపాస్ రోడ్డు వద్ద టూటౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయానికి నల్గొండలో దొంగిలించిన మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో అతను నల్గొండలో కొట్టేసిన మోటార్ సైకిల్‌తో పాటు, నెల్లూరులో దొంగిలించిన మరో స్కూటీ గురించిన వివరాలు వెల్లడించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ టూటౌన్ సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో సమర్థవంతంగా పనిచేసి నేరస్థుడిని పట్టుకున్న టూటౌన్ ఎస్ఐలు సైదాబాబు, మానసలతో పాటు సిబ్బంది బాలకోటి, షకీల్, సైదులు, మహేష్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : లాయర్లకు సుప్రీం కోర్ట్ కీలక సూచనలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>