కలం, వెబ్ డెస్క్: దేశంలోని లాయర్లకు సుప్రీం కోర్ట్ (Supreme Court) కీలక సూచనలు జారీ చేసింది. తమ క్లెయింట్లతో పాటు ప్రత్యర్థి లాయర్లు, వారి క్లెయింట్లతో కూడా గౌరవపూర్వకంగా మెలగాలని స్పష్టం చేసింది. కోర్ట్ ప్రాంగణంలో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడినా.. సదరు లాయర్‌పై రాష్ట్ర బార్ కౌన్సిల్ సహా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. అడ్వకేట్స్ యాక్ట్–1961 ప్రకారం, ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం వాంఛనీయం కాదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ బెంచ్ వివరించింది.
అసలేం జరిగిందంటే..
2012లో ఓ న్యాయవాది ప్రత్యర్థి క్లెయింట్‌తో కోర్టు బయట అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆయనపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. సదరు లాయర్ లైసెన్స్ రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. ఇద్దరు న్యాయమూర్తులు ఈ రోజు విచారణ చేపట్టారు. కేసు వాదనల్లోనే ప్రత్యర్థులుగా ఉండాలని.. బయట కూడా అదే తరహాలో వ్యవహరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోర్ట్ ప్రాంగణాన్ని అత్యంత గౌరవనీయ స్థలంగా ఉంచే బాధ్యత ప్రతి లాయర్‌పై ఉంటుందని పేర్కొంది.

