రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భూభారతి, సాదాబైనమా, రీసర్వే, నక్షా సర్వే, మీసేవ, ఎస్‌ఐఆర్, ఆర్‌టీఐ లాంటి రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ (Mahbubnagar) ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై మండల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి (Bhu Bharati) పోర్టల్‌లో 60 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సర్వేయర్ల కొరత, కోర్టు కేసులు, సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యమైన వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ల్యాండ్ యాప్‌లోని జీపీఎస్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

తహసీల్దార్లు తమ పరిధిలోని పెండింగ్ ఫైళ్లపై నిరంతరం ఫాలోఅప్ చేయడంతోపాటు, కోర్టు కేసులకు సంబంధించిన నివేదికలను పూర్తి వివరాలతో పంపాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ పనులు కొనసాగుతున్నప్పటికీ భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. సాదాబైనమా దరఖాస్తుల పరిష్కారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా(Mahbubnagar)లో చేపడుతున్న గ్రామాల రీసర్వే పనులను వేగవంతం చేస్తూ గ్రామ సరిహద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల డిమార్కేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే దశల కోసం ముందస్తుగా గ్రామసభలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, శిక్షణ పొందిన సిబ్బందిని రీసర్వే బృందాలతో సమన్వయం చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు లైసెన్స్ సర్వేయర్లను వినియోగించి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.

ఆర్‌టీఐ దరఖాస్తులను కూడా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో పంపాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, డి.ఆర్.ఓ ఎ. నిర్మల, ఆర్‌.డి.ఓ నవీన్, జిల్లా భూ సర్వే రికార్డుల శాఖ ఏడీ అశోక్, సంబంధిత అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Also Read : క్షుద్ర రాజకీయానికి తెరలేపారు.. కాంగ్రెస్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>