కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో బుధవారం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, ముఖ్యంగా విద్యార్థినులు ఆన్లైన్ వేదికలలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా యువతులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకోవడం, స్నేహం పేరుతో నమ్మకం కలిగించడం, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు సేకరించడం, అనంతరం వాటిని మార్ఫింగ్ చేయడం లేదా బయటపెడతామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం వంటి పద్ధతులకు పాల్పడుతున్నారని వివరించారు. అలాగే నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ప్రేమ పేరుతో మోసాలు, వీడియో కాల్స్ ద్వారా బ్లాక్మెయిల్, నకిలీ ఉద్యోగ అవకాశాలు, ఆన్లైన్ గేమ్స్, ఫేక్ లింకులు వంటి వాటి ద్వారా విద్యార్థులను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారని తెలిపారు.
విద్యార్థినులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు, చిరునామా, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోకూడదని, సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, ఎవరికీ OTP, బ్యాంకు వివరాలు, UPI PIN తెలియజేయవద్దని, ఆన్లైన్లో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా లేదా అసభ్యకర సందేశాలు పంపినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మోసానికి గురైన వెంటనే స్పందించాలి
సైబర్ ఆర్థిక మోసానికి గురైనప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణించాలని, మోసం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. సత్వరమే ఫిర్యాదు చేయడం ద్వారా మోసగాళ్ల ఖాతాలకు వెళ్లిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థినులకు సైబర్ నేరాల రకాలు, వాటి నుంచి రక్షించుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాలకు గురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించి వివరించారు. విద్యార్థినులు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరి కుమార్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్, పోలీస్ అధికారులు, సిబ్బంది, సుమారు 2300 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.

