కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారంటూ వస్తున్న తీవ్ర ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారు అని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
1300 మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర పవిత్రను కాంగ్రెస్ నేతలు తమ నీచమైన వ్యాఖ్యలతో అపవిత్రం చేస్తున్నారని విమర్శించారు. శాస్త్రీయ కోణంలో మాట్లాడాల్సిన రాజకీయపార్టీలో క్షుద్ర పూజల గురించి మాట్లాడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావుపై కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. అద్దంకి దయాకర్లా జుగుప్సాకరంగా మాట్లాడాడని, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాంత్రిక, తాంత్రిక కుమార్లా మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు వారి మాటలతో గాంధీ భవన్‌ను గ్రహాచార భవన్‌గా మార్చారన్నారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, హరీష్ రావు తనకు ఇష్టమైన దేవాలయాలకు వెళ్లడం అది వ్యక్తిగతమైన అంశం అని చెప్పారు.
ప్రజలు నాశనం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులకు కాంగ్రెస్ నేతలు రిప్లై ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కుమార్ భాషను ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లను చూసి దెయ్యాలు, భూతాలు కూడా భయపడతాయని చెప్పారు.
ఇంతజరుగుతున్నా హిందూ ధర్మ రక్షకులం అని చెప్పుకునే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 52 రోజులు రహస్య ప్రదేశానికి క్షుద్ర పూజల కోసం వెళ్లారా అని నిలదీశారు. దేశం, ప్రజలు నాశనం కావాలని రాహుల్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి 12 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ గృహప్రవేశం చేశారని.. అక్కడి ఏ మాంత్రికుడిని పిలిపించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

