కలం, ఖమ్మం బ్యూరో: సొంత పెద్దమ్మ పుస్తెల తాడునే దొంగతనం చేసిన ఇద్దరు యువకులను ఖమ్మం జిల్లా ఏన్కూర్ (Enkoor) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురం తండాకు చెందిన భూక్య హర్షవర్ధన్, కొత్త తండాకు చెందిన బానోత్ కిషోర్ దూరపు బంధువులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఒకే చోట ఉంటున్నారు. హర్షవర్ధన్ స్నేహితుల నుంచి రూ.లక్ష అప్పులు చేశాడు. వచ్చే జీతం సరిపోకపోవడం, అప్పు ఇచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి మొదలవడంతో త్వరగా డబ్బు సంపాదించాలనే దురాలోచన చేశాడు. కిషోర్‌తో కలిసి చోరీ పథకం రచించాడు.
లైట్ ఆఫ్ చేసి..
జులై 31న శ్రీరాంపురం తండాకు వచ్చిన ఇద్దరు మద్యం సేవించారు. అర్ధరాత్రి తండాలోని పెద్దమ్మ సాంఖలి ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరికి అనుమానం రాకుండా ముందుగానే లైట్ ఆఫ్ చేసి, నిద్రిస్తున్న సాంఖలి మెడలోని బంగారు పుస్తెలతాడును బ్లేడ్‌తో కట్ చేసి అపహరించారు. గొలుసు పోయిందని వృద్ధురాలు ఏన్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో మంగళవారం తూతిక్కలింగన్నపేట బ్రిడ్జి సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న హర్షవర్ధన్, కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి దొంగిలించిన బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సై సంధ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి, కానిస్టేబుళ్లు రాజా, దేవేంద్ర, రవి, శంకర్, వినయ్, హోంగార్డ్ రామును కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అభినందించారు.

