కలం, వెబ్ డెస్క్: మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు మారింది ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ పరిస్థితి. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇంగ్లండ్ (England) అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు నాలుగో టెస్ట్‌లో ఇంగ్లీష్ ప్లేయర్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాలు పట్టేయడంతో గస్ అట్కిన్సన్ (Gus Atkinson) మైదానాన్ని విడిచిపెట్టాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజున పేసర్ గస్ అట్‌కిన్సన్ హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో మైదానాన్ని విడిచివేయాల్సి వచ్చింది. బౌలింగ్ చేస్తుండగా ఎడమ కాలిలో అసౌకర్యం కలగడంతో వెంటనే ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లాడు.
జోఫ్రా ఆర్చర్ గాయంతో జట్టులో ఖాళీ ఏర్పడింది. అతడి స్థానంలో ఆడటానికే నాలుగో మ్యాచ్‌లో అట్కిన్సన్‌కు (Gus Atkinson) అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా వికెట్లు తీసి 152 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బాగా ఆరంభించిన అతను స్కాట్ బోలాండ్ వికెట్ తీసిన వెంటనే గాయం కారణంగా ఆట కొనసాగించలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ మరోసారి ఇరకాటంలో పడినట్లయింది.
“గస్ అట్‌కిన్సన్ ఎడమ హ్యామ్‌స్ట్రింగ్‌లో నొప్పి కారణంగా మైదానం విడిచాడు. వైద్య బృందం పరీక్షిస్తోంది,” అని ఇంగ్లాండ్ క్రికెట్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ గాయాలతో జట్టుకు దూరమైన నేపథ్యంలో, అట్‌కిన్సన్ గాయం ఇంగ్లాండ్ బౌలింగ్ దళానికి మరింత సమస్యగా మారింది.
Read Also: స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన రేణుక.. శ్రీలంకకు చుక్కలు చూపించిందిగా..
Follow Us On: Youtube


