నాడు కేసీఆర్..నేడు రేవంత్ : విద్యపై ఇద్దరిదీ ఒకే ఆవేదన!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యా ప్రమాణాలు రాజకీయ పార్టీల మధ్య మరోసారి చర్చకు దారితీశాయి. తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎంగా పని చేసిన కేసీఆర్, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కనీసం ఉద్యోగ అప్లికేషన్ కూడా రాయలేకపోతున్నారంటూ సీఎం రేవంత్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

రూ.లక్షలు ఖర్చు పెట్టినా ‘క్రిమినల్ వేస్ట్’ అవుతున్నదంటూ కామెంట్ చేశారు. ఇంజినీరింగ్ అభ్యర్థులు చివరకు హోంగార్డు పోస్టులకూ అప్లై చేస్తున్నారని, ‘మన ఇంజినీరింగ్ విద్య అంత గొప్పగా ఉంది’ అంటూ పదేండ్ల క్రితమే కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణ వచ్చి పదేండ్లయినా విద్యా ప్రమాణాలు మారలేదని సీఎం రేవంత్‌ కామెంట్స్‌తో స్పష్టమవుతున్నది.. భవిష్యత్తులో ఎలా మారుతుందనేది తేలాల్సి ఉన్నది.

రాజకీయ అస్త్రంగా సీఎం కామెంట్..

కేసీఆర్ హయాంలో ‘హోంగార్డు ఉద్యోగాలకు ఇంజినీర్లు’ అనే వ్యాఖ్య వినిపిస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి హయాంలో ‘క్రిమినల్ వేస్ట్’ అనే కామెంట్ వినిపించింది. పదాలు ఏవైనా ఇంజినీరింగ్ విద్య (Engineering Education) సరైన ప్రమాణాలతో లేదని, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు లభించడం లేదన్నది వీరి మాటల్లో వ్యక్తమవుతున్నది. ఏటా లక్షన్నర మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారని పదేండ్ల క్రితం కేసీఆర్ పేర్కొంటే, ఇప్పుడు లక్షా పదివేలు అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం సంవత్సరానికి రూ.1.08 లక్షలను ఖర్చు చేస్తున్నదని, చివరకు వారికి స్కిల్స్ లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లభించడం లేదని పలు సందర్భాల్లో సీఎం వ్యాఖ్యానించారు.

‘‘ప్రైవేటు రంగంలో ఇంజినీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా పెరిగాయి. నాణ్యత లేని విద్యతో ఉపాధి అవకాశాలు లభించడం లేదు. అందువల్లనే స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. అందులో జపనీస్, జర్మన్ లాంటి భాషల్లో శిక్షణ కల్పిస్తున్నాం” అని పేర్కొన్నారు. సీఎం చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ కామెంట్ ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రాజకీయ అస్త్రంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండు రోజుల క్రితం ట్వీట్ ద్వారా సెటైర్ వేస్తే, విద్యార్థులను సీఎం అవమానించారని ఏకంగా రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.

కేటీఆర్‌‌కు కాంగ్రెస్ కౌంటర్..

‘క్రిమినల్ వేస్ట్’ పదాన్ని ప్రస్తావించి సీఎం రేవంత్‌ రెడ్డిని కేటీఆర్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ సైతం అదే పదాన్ని పట్టుకుని విమర్శలు చేస్తున్నది. కానీ పదేండ్ల క్రితం కేసీఆర్ చేసిన హోంగార్డు కామెంట్‌ ప్రస్తావనలోనే లేకుండాపోయింది. హోంగార్డు, కానిస్టేబుల్, ఉపాధి హామీ పనులకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎగబడుతున్నారని కేసీఆర్ కామెంట్ చేయడం.. ఆ పనులను అవమానించడమా? లేక ఇంజినీరింగ్ విద్యను చులకన చేయడమా? అనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఇప్పుడు సీఎంను విమర్శిస్తున్న కేటీఆర్.. పదేండ్ల క్రింద కేసీఆర్ చేసిన కామెంట్ల గురించి వివరణ ఇవ్వాలని హస్తం లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాలు ఘోరంగా ఉన్నాయని 2017లోనే కేసీఆర్ గుర్తించినప్పుడు 2023 వరకు ఆరేండ్ల పాటు ఎందుకు ఏమీ చేయలేకపోయారన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. ఇంజినీరింగ్ వ్యవస్థను ఎందుకు బాగా చేయలేదని, ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు నిర్లక్ష్యం వహించారని వాళ్లు నిలదీస్తున్నారు.

2026 జులై 31న సీఎం రేవంత్‌ రెడ్డి..

ఏటా రాష్ట్రంలో సుమారు లక్షా పది వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ఒక తెల్ల కాగితం ఇచ్చి ‘ఒక ఉద్యోగ దరఖాస్తు రాయండి’ అంటే కూడా కొందరు రాయలేకపోతున్నారు. ఇది ఒక క్రిమినల్ వేస్ట్. ఇంజినీరింగ్ చదివాననే కారణంతో చిన్న ఉద్యోగానికి అప్లై చేయరు. కానీ అవసరమైన నైపుణ్యాలు మాత్రం నేర్చుకోవడం లేదు. మా పిల్లలు ఇంజినీరింగ్ చదివారని తల్లిదండ్రులు చాలా హోప్స్ పెట్టుకుంటారు.

2017 జనవరి 4న అసెంబ్లీలో కేసీఆర్..

ఏటా లక్షన్నర మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వీళ్లంతా ఏం చేయాలి? ఎక్కడకు పోవాలి? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 36 వేల మంది ఇంజినీర్లు అప్లై చేశారు. హోంగార్డు పోస్టులకూ వేల మంది అప్లై చేశారు. ఇంజినీరింగ్ చేసినోళ్ళు హోంగార్డులుంటరా.. కానిస్టేబుళ్లుంటరా.. చివరకు గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తారా? మన ఇంజినీరింగ్ విద్య అంత గొప్పగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>