కలం, కరీంనగర్ బ్యూరో: ఉపాధి హామీ (వీబీ జీ రామ్ జీ) పనుల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని రంగంలోకి దించింది. పనులు చేయకుండానే బిల్లులు నమోదు చేయడం, బోగస్ హాజరు, తప్పుడు కొలతలు వంటి అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ కొత్త విధానం పనిచేస్తున్నది. పనుల ప్రగతి, కూలీల హాజరును ఫొటోల ఆధారంగా పక్కాగా పరిశీలిస్తూ.. పని చేసిన కూలీలకు మాత్రమే వేతనాలు అందేలా అక్రమాలను అడ్డుకుంటున్నది.
ఫేస్ అటెండెన్స్ ఉన్నప్పటికీ..
జిల్లాలో (Karimnagar) ఉపాధి పనుల్లో ఇప్పటికే ఫేస్ అటెండెన్స్ విధానం అమల్లో ఉంది. అయితే కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. పని ప్రదేశానికి వచ్చిన సమయంలో ఫొటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత, పనికి హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల మేట్లు, కూలీలు కలిసి ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
నాలుగంటలు.. రెండు హాజర్లు
ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ విధానం కీలకంగా మారింది. ఉదయం, మధ్యాహ్నం తీసే ఫొటోలను క్లౌడ్ సర్వర్లోని ఏఐ సాప్ట్వేర్ విశ్లేషిస్తున్నది. పని ప్రారంభమైన వెంటనే మొదటి ఫొటోను అప్లోడ్ చేయాలి. కనీసం నాలుగు గంటల తర్వాత రెండోసారి హాజరు నమోదు చేయాలి. రెండు ఫొటోల్లో పని పురోగతి, కూలీల హాజరు, పని ప్రదేశంలో వచ్చిన మార్పులను ఏఐ పోల్చి చూస్తున్నది. ఉదయం, మధ్యాహ్నం ఫొటోల్లో ఎలాంటి మార్పు లేకపోతే పని జరగలేదని గుర్తించి సంబంధిత మస్టర్ను రద్దు చేసే అవకాశం ఉంది. కూలీలు పనికి రాకపోయినా పాత ఫొటోలను మొబైల్ స్క్రీన్పై చూపించి మళ్లీ హాజరు నమోదు చేసే మోసాలను కూడా ఏఐ గుర్తించగలదని అధికారులు చెప్తున్నారు.
తప్పుడు బిల్లులకు చెక్
ఉపాధి పనుల్లో కొందరు కార్యాలయాల్లోనే కూర్చొని తప్పుడు బిల్లులు రూపొందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపై ఇలాంటి వాటిని శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సర్వేలు, డిజిటల్ కొలతల ద్వారా గుర్తించనున్నారు. డిజిటల్ కొలతలు, ఏఐ అంచనాలకు భిన్నంగా ఎంబుక్ (మెజర్మెంట్ బుక్) నమోదు చేసే అధికారులపై కూడా విచారణ చేపట్టేలా నిబంధనలు మారుతున్నాయి. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారుల ఐడీలను నిలిపివేయడంతో పాటు రికవరీ చర్యలు చేపట్టనున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఇస్రోకు చెందిన ‘భువన్’ పోర్టల్ శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సర్వేలు, జిల్లా అంబుడ్స్మన్ పర్యవేక్షణతో ఉపాధి పనులపై నిఘా మరింత పెరగనుంది.
అక్రమాలకు అడ్డుకుట్ట
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 3,11,801 జాబ్ కార్డులు ఉండగా, 4,61,172 మంది కూలీలు నమోదయ్యారు. ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా కూలీల హాజరు, చేసిన పనిని కచ్చితంగా గుర్తించవచ్చు. దీంతో పారదర్శకత పెరుగుతుంది. కష్టపడి పనిచేసే కూలీలకు పూర్తి వేతనం అందుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
– శ్రీనివాస్, ఏపీవో, మానకొండూర్

