కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని (Erravalli) తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) నిర్వహించిన సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రధానంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటంపై చర్చించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మళ్లీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు (Assembly Session) కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ఆయన సభకు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపై సభలో జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్(KCR) ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ సభలు సాగనున్నాయి. గ్రామస్థాయి నుంచి రైతుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని నేతలకు సూచించారు.
ఎర్రవెల్లిలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), సబితా ఇంద్రా రెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల కీలక నేతలు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.
Read Also: ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ ఓరియంటేషన్
Follow Us On: Instagram


