epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైదరాబాద్​లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు

కలం, వెబ్​డెస్క్​: రియల్ ​ఎస్టేట్​కు 2025 కలసి రాలేదు. ముఖ్యంగా ఇళ్ల అమ్మకాలు (Housing sales) భారీగా తగ్గిపోయాయి. చెన్నై మినహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అన్నింటికంటే ఎక్కువగా హైదరాబాద్​లో హౌసింగ్​ సేల్స్​ ఏకంగా 23శాతం తగ్గాయి. ఈ మేరకు రియల్​ ఎస్టేట్​ సంస్థ అనరాక్​ నివేదిక వెల్లడించింది. అనరాక్​.. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ ఎన్​సీఆర్​, ముంబై, హైదరాబాద్​, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్​కతాలో 2025లో ఇళ్ల అమ్మకాలను విశ్లేషించింది. ఈ ఏడు నగరాల్లోనూ కలిపి నిరుడు 4.59లక్షల ఇళ్లను అమ్ముడవగా, ఈసారి 3.95 లక్షలు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే హౌసింగ్​ సేల్స్ సగటున​ 14శాతం తగ్గాయి. ఈ తగ్గుదల హైదరాబాద్​తోపాటు ముంబై, పుణెలో ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల, ఐటీ సెక్టార్​లో ఉద్యోగాల కోత, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర కారణాల వల్ల గృహ కొనుగోళ్లు మందగించాయని నివేదిక వెల్లడించింది. అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ ఆదాయంలో మాత్రం పెరుగుదల కనిపించడం విశేషం. నిరుడు రూ.5.68లక్షల కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.6లక్షల కోట్లకు చేరింది. అంటే ఆదాయం 6శాతం పెరిగింది. కాగా, దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాల్లో ముంబై, పుణె, బెంగళూరు, హైదరాబాద్​, ఢిల్లీ ఎన్​సీఆర్​ వాటా 90శాతం ఉంది.

నగరాల వారీ ఇలా:

ఈ ఏడాది అత్యధికంగా ముంబైలో 1,27,875 ఇళ్ల అమ్మకాలు (Housing sales) జరిగాయి. అయినా, ఇది నిరుటి కంటే 18శాతం తక్కువ. పుణెలో ఈ సంవత్సరం 65,135 ఇళ్లు, నిరుడు 81,090 ఇళ్లు అమ్ముడయ్యాయి. అంటే తగ్గుదల 20శాతం. హౌసింగ్​ సేల్స్​లో ఈ రెండు నగరాల వాటా 49శాతం. ఇక బెంగళూరులో నిరుడు 65,225, ఈసారి 62,205 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ 5శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఢిల్లీ ఎన్​సీఆర్​లో గతేడాది 61,900 ఇళ్లు, ఈ సంవత్సరం 57,220 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 8శాతం తగ్గుదల నమోదైంది. కోల్​కతాలో నిరుడు 18,135 ఇళ్లు, ఈసారి 16,125 ఇళ్లు అమ్ముడయ్యాయి. తగ్గుదల 12శాతం. ఒక్క చెన్నైలో మాత్రం నిరుడుతో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ఇక్కడ ఈ సంవత్సరం 22,180 ఇళ్లు అమ్ముడవగా, గతేడాది 19,220 మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 15శాతం ఎక్కువ. ఇక హైదరాబాద్​లో గత సంవత్సరం 58,540 జరగ్గా, ఈ ఏడాది అది 44,885కు తగ్గింది. అంటే ఏకంగా 23శాతం తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది అన్ని నగరాల్లోనూ కలిపి అమ్ముడుపోని ఇళ్లు 5.77లక్షలకు చేరుకున్నట్లు నివేదిక తెలిపింది.

కొత్త గృహాలు.. ధరలు పెరిగాయి:

ఈ ఏడు నగరాల్లోనూ 2024తో పోలిస్తే 2025లో కొత్త ఇళ్లు ప్రాజెక్టులు పెరిగాయి. నిరుడు 4.12లక్షల కొత్త ఇళ్లు ప్రారంభం కాగా, ఈసారి 4.19లక్షలకు చేరింది. అంటే 2శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం కొత్త ప్రాజెక్టుల్లో ముంబై, బెంగళూరు వాటా 48శాతంగా ఉంది. అలాగే ధరల పెరుగుదల సగటున 8శాతం నమోదైంది. అత్యధికంగా ఢిల్లీలో 23శాతం ధరలు పెరిగాయి. అలాగే ఏడు నగరాల్లోనూ చదరపు అడుగు ధరల్లో సైతం పెరుగుదల కనిపించింది. 2024 చివరిలో చదరుపు అడుగు ధర సగటున గరిష్ఠంగా రూ.8,590 ఉండగా, 2025 చివరికి అది రూ.9,260కి పెరిగింది. ఢిల్లీ ఎన్​సీఆర్​లో అత్యధికంగా చదరపు అడుగు ధర రూ.7,550 నుంచి రూ.9,300కు పెరిగింది. లగ్జరీ గృహాలకు ఈ ఏడాది డిమాండ్​ ఎక్కువగా కనిపించింది. రూ.2.5కోట్లకు పైగా ధర ఉన్న ఇళ్లు వాటా అమ్మకాల్లో నిరుడు 18శాతం ఉండగా, ఈ ఏడాది అది 21శాతానికి చేరింది.

2026పై అంచనాలు:

రాబోయే సంవత్సరంలో రియల్​ ఎస్టేట్​ అభివృద్ధిపై ఆర్​బీఐ వడ్డీ రేట్ల కోతలు, డెవలపర్లు ధరలు నియంత్రించడంపై ఆధారపడి ఉంటుందని నిర్మాణ రంగ సంస్థలు భావిస్తున్నాయి. రెపో రేట్లు మరింత తగ్గితే, హౌస్​ లోన్స్​ వడ్డీ రేట్లు తగ్గి, డిమాండ్​ పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>