కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో పనిచేస్తూ వైద్యపరమైన కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్గా (Medically Unfit) తేలిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరందరికీ ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ఫిట్గా నిర్ధారణ అయిన ఉద్యోగులందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఆర్టీసీలో 21 విభిన్న కేటగిరీల్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైన వారికి కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యామ్నాయ ఉద్యోగాలను వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తారు. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత బట్టి ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అవసరమైన చోట్ల జిల్లా కలెక్టర్ల సహకారంతో నియామకాలు పూర్తి చేస్తారు. 2020 జనవరి 1 నుంచి ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడుతున్నారు. ఈ కారణంగానే మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: మాధవీలతను న్యూ ఇయర్ వేడుకలకు పిలిచా : జేసీ ప్రభాకర్
Follow Us On: Pinterest


