కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నల్లకుంట(Nallakunta) పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ(Nalgonda) జిల్లా హుజూరాబాద్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసముంటున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి వెంకటేష్ త్రివేణిపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధింపులకు గురి చేయడంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ ఆమెకు ఫోన్ చేస్తూ ఇక నుంచి మారిపోతానని నమ్మబలికి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.
త్రివేణి హైదరాబాద్‌కు వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ భర్తతో గొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలో వెంకటేష్ ఈ నెల 23న రాత్రి అకస్మాత్తుగా భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. కూతురు అడ్డుకోవడానికి వస్తే తనను కూడా మంటలోకి తోసి వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో నుంచి అరుపులు విన్న స్థానికులు త్రివేణిని, తన కూతురిని ఆస్పత్రికి తరలించారు. త్రివేణి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుమార్తె స్పల్వ గాయాలతో బయటపడింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, సీసీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వెంకటేష్ కోసం గాలిస్తున్నారు.
Read Also: కెనడాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్య
Follow Us On: Pinterest


