కలం, నిజామాబాద్ బ్యూరో: ఢిల్లీలో విద్యార్థులు, యువతపై లాఠీచార్జీకి నిరసనగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పత్రం లీకేజీ వలన పలువురు విద్యార్థులు చనిపోయారని, లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు పరీక్ష పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా విద్యార్థులు తెలియజేస్తే పోలీసులు క్రూరంగా లాఠీఛార్జ్ చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటన దేశ చరిత్రలో నిలిచిపోతుందని దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. చనిపోయిన నీట్ విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ నాయకులు నవదీప్, నితిన్, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, శ్రీనివాస్, సంతోష్, సిద్దార్త, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.

