కరీంనగర్‌లో ప్రతి డివిజన్‌ అభివృద్ధే లక్ష్యం.. మేయర్ కొలగాని

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ (Karimnagar Mayor) కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో 25వ డివిజన్ సుభాష్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైయిన్ నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో సీసీ రోడ్డు, తాగునీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా పైప్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేయడం లాంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు కూడా దశలవారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్, 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>