కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నిర్దేశిత మెనూను పాటించకపోవడంపై నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
శుక్రవారం మెనూ ప్రకారం వెజిటేబుల్ కర్రీ, గుడ్డు, సాంబారు వడ్డించాల్సి ఉండగా.. వంట ఏజెన్సీ నిర్వాహకులు కేవలం గుడ్డు, సాంబారు మాత్రమే తయారు చేసినట్లు గుర్తించారు. వెజిటేబుల్ కర్రీ ఎందుకు తయారు చేయలేదని నిర్వాహకులను కలెక్టర్ ప్రశ్నించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, వంట ఏజెన్సీ నిర్వాహకులకు వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను (హెచ్‌ఎం) ఆదేశించారు. అంతకు ముందు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెబుతున్న గణితం పాఠ్యాంశాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కూడికలు, తీసివేతలను బోర్డుపై చేయించి వారి సామార్థ్యాన్ని గుర్తించి అభినందించారు.
‘ఫ్రైడే– డ్రై డే’ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘ఫ్రైడే-డ్రై డే’ (Friday Dry Day) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) పరిశీలించారు. గ్రామంలోని పలు నివాసాలను సందర్శించి నీటి తొట్టెలు, కుండీలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను తనిఖీ చేశారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారా లేదా అని ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొట్టెలు, కుండీల్లో ఎక్కువ రోజుల పాటు నీటిని నిల్వ ఉంచడం వల్ల దోమల లార్వా పెరిగి దోమల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇళ్లలో, ఇంటి ఆవరణలో ఎక్కువకాలం నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
పంచాయతీ కార్యాలయ రికార్డుల పరిశీలన
మందిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కార్యాలయ రికార్డులు, జనన–మరణ ధ్రువపత్రాల నమోదులు, వివాహ రిజిస్ట్రేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త భవన నిర్మాణంపై సర్పంచ్, కార్యదర్శితో చర్చించారు.
పంచాయతీకి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఏ పనులకు వినియోగించారు, ప్రస్తుతం ఎన్ని నిధులు అందుబాటులో ఉన్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయా అని కార్యదర్శిని ప్రశ్నించగా.. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.11 లక్షలు అందాయని, 16వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా విడుదల కాలేదని కార్యదర్శి వివరించారు. అలాగే పంచాయతీకి ఉన్న ఆర్థిక వనరులు, ఆస్తి పన్ను, ఇతర ఆదాయ వనరులపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.
గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పురోగతిపై బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1,058 మంది ఓటర్లలో మరణించిన 26 మంది పేర్లను తొలగించినట్లు, అలాగే 15 డబుల్ ఓట్లను గుర్తించి తొలగించినట్లు బీఎల్‌ఓలు తెలిపారు. వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన 20 మంది మహిళల ఓట్లను కూడా తొలగించినట్లు వివరించారు. ఈ సందర్భంగా తొలగించిన మహిళలకు వారి మెట్టినింటి ప్రాంతంలో ఓటు నమోదు జరిగిందా లేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. అందుకు బీఎల్‌ఓలు, వారి ఎపిక్ నంబర్లను పరిశీలించిన తర్వాతే జాబితా నుంచి పేర్లు తొలగించినట్లు, మరో రెండు రోజుల్లో గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
గ్రామంలోని బీసీ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సురేందర్ రెడ్డి, గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, రోడ్డు సమస్యకు పరిష్కారం చూపేలా తహశీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యాలయంలో ధరణి పెండింగ్ ఫైళ్లు, మీ సేవా దరఖాస్తులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతోందో, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారో తహశీల్దార్ సింధూజను అడిగి తెలుసుకున్నారు.
Read Also: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
Follow Us On : WhatsApp

