కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మరో డీఎస్సీ (DSC) నిర్వహించనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. నేడు పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవల తల్లికి వందనం పథకంలో లబ్ధిపొందిన కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఏపీలో మరో డీఎస్సీ నిర్వహణపై కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఇటీవల మెగా డీఎస్సీ (Mega DSC) నిర్వహించి భారీ ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇక త్వరలో మరో డీఎస్సీ నిర్వహించి 3 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఉంటుందని లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అందుకే పిల్లల చదువుల్లో పురోగతిని తెలుసుకునే వేదికగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్స్ ప్రారంభించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని సీఎంకు మాట ఇచ్చానని లోకేశ్ అన్నారు. ఈ మార్పు కోసం తాను ఒక్కడే పని చేస్తే సరిపోదని, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు.
లోకేశ్ తన ప్రసంగంలో పిల్లలను ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీర్, లాయర్ అవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అలాగే ఎంతమంది రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని అడిగారు. బాగా చదువుకున్నా కూడా రాజకీయాల్లోకి రావాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు.
Read Also: టీడీపీ కీలక ప్రకటన
Follow Us On: Sharechat

