కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కోచింగ్ (Free Coaching) ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో (BC Study Circles) ఈ కోచింగ్ ఇవ్వబోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ/అనాథ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు.
ఈ జాబ్స్ కోసం ప్రిపేర్ అయితేనే..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల కోసం కోచింగ్ ఇవ్వనున్నారు. అలాగే, బ్యాంక్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇస్తారు.
125 రోజుల పాటు..
మొత్తం 125 రోజుల పాటు కోచింగ్ ఇస్తారు. అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించరాదు. ప్రస్తుతం ఏదైనా రెగ్యులర్ కోర్స్ చదువుతున్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, గతంలో స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ (Free Coaching) తీసుకున్నవారైనా.. ప్రవేశానికి అర్హులు కారు. డిగ్రీలో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇవే ముఖ్యమైన తేదీలు..
జులై 24వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 14వ తేదీతో గడువు ముగుస్తుంది. పరిశీలన అనంతరం, ఆగస్ట్ 18న ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఆగస్ట్ 20 నుంచి 24వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి కోచింగ్ ప్రారంభమవుతుంది.
ప్రతి నెలా రూ.1000 అందజేత..
కోచింగ్‌లో చేరిన ప్రతి అభ్యర్థి కచ్చితంగా 75 శాతం కంటే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో ప్రతి నెలా రూ.1000 స్టైఫండ్ అందజేస్తారు. అభ్యర్థులకు మరింత సమాచారం తెలుసుకోవాలంటే.. 040-24071178, 7780359322 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.
Read Also: ‘వాంగ్‌చుక్’ మరో అన్నా హజారే.. సీజేపీ, కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

