కలం, వెబ్ డెస్క్: మిగిలిన కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవరసం. ఎందుకంటే ఈ సీజన్ లో మనం వ్యాధుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లు, ఇతర సూక్ష్మజీవులు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. అందుకే ఈ కాలంలో సలాడ్స్ తినేవారు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు (Monsoon Health Tips) తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సలాడ్స్ ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, వాటి తయారీలో ఉపయోగించే పచ్చి కూరగాయలను సరిగ్గా శుభ్రం చేయకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. సలాడ్స్ లో సాధారణంగా క్యారెట్, టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, క్యాబేజీ, ఆకుకూరలు వంటి పచ్చి పదార్థాలు ఉపయోగిస్తారు. అయితే వీటిని శుభ్రం చేయకుండా పచ్చిగా తినడం వల్ల వాటిపై ఉండే సూక్ష్మజీవులు శరీరంలోకి చేరుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మురికి నీరు, కాలుష్యం, బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో కూరగాయలను పరిశుభ్రంగా కడిగి తీసుకోవడం చాలా అవసరం.
అపరిశుభ్ర కూరగాయలు.. అనారోగ్యాలు
1. తీవ్ర మైన జీర్ణక్రియ సమస్యలు
పచ్చి కూరగాయలు సరిగ్గా కడగకుండా తినడం వల్ల వాటిపై ఉండే మురికి, కలుషిత నీటి అవశేషాలు నేరుగా పొట్టలోకి పోయి జీర్ణవ్యవస్థ పూర్తిగా మందగిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
2. ఫుడ్ పాయిజనింగ్
వానకాలంలో కూరగాయలపై ఇ–కోలి, సాల్మోనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు వేగంగా పెరుగుతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఒళ్లునొప్పులతో కూడిన తీవ్రమైన జ్వరం కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
3. ఇమ్యూనిటీ తగ్గడం, ఇన్ఫెక్షన్లు
సాధారణంగానే వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో కలుషితమైన పచ్చి ఆహారం తినడం వల్ల.. గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
4. దీర్ఘకాలిక పరాన్నజీవుల ముప్పు
క్యాబేజీ, ఆకుకూరలు వంటి వాటిలో వర్షపు మురుగు నీటి వల్ల చిన్న చిన్న పురుగులు లేదా వాటి గుడ్లు ఉండిపోతాయి. ఇవి కడుపులోకి వెళ్తే ప్రేగుల ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
వర్షాకాలంలో సలాడ్స్ పూర్తిగా మానేయాలా?
వర్షాకాలంలో సలాడ్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సలాడ్స్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బ్యాక్టీరియా ముప్పు నుంచి బయట పడేందుకు కూరగాయలను సరైన పద్ధతిలో శుభ్రం చేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సలాడ్స్ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
- కూరగాయాలను గోరువెచ్చని నీటితో కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం వేసి కడగడం
- క్యాబేజీ, పాలకూర వంటి ఆకుకూరలలో పురుగులు, మట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి ప్రతి పొరను విడదీసి, ప్రత్యేకంగా కడగాలి.
- ఎక్కువసేపు కట్ చేసి నిల్వ ఉంచిన సలాడ్స్ ను అస్సలు తినకూడదు.
- ఎప్పటికప్పుడూ తాజాగా సలాడ్స్ ప్రిపేర్ చేసుకుని తినాలి.
- వర్షాకాలంలో బయట హోటల్స్ లేదా రోడ్డు పక్కన దొరికే పచ్చి సలాడ్స్ తినొద్దు. వారు కూరగాయలను సరిగ్గా కడిగారో లేదో తెలియదు కాబట్టి వాటిని దూరం పెట్టడం మంచిది.
- చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు సలాడ్స్ తినకపోవడమే మంచిదట. ఒకవేళ తిన్నా పచ్చికూరగాయలకు బదులుగా కొద్దిగా ఉడికించిన వెజిటబుల్స్ తీసుకోవడం మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
ఈ జాగ్రత్తలు పాటిస్తూ సలాడ్స్ తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు నిపుణులు.
(Note: ఈ సమాచారం కేవలం మీ ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. దీన్ని వైద్యుల హెచ్చరికగా భావించవద్దు. సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం)

