బీఆర్ఎస్ తీరుపై చర్చ.. అప్పుడు అణచివేతలు.. ఇప్పుడు నీతులు?

కలం, తెలంగాణ బ్యూరో: అధికారంలో ఉన్నప్పుడు అంతా సవ్యమే అనిపించడం.. అధికారం పోగానే అపసవ్యంగా తోచడం కొన్ని పార్టీలకు కామన్. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో ముందువరుసలోకి చేరింది. జాబ్ నోటిఫికేషన్లు అడిగినందుకు, ప్రశ్నా పత్రాల లీకేజీపై నిరసన తెలిపినందుకు, గ్రూప్ 1 అభ్యర్థిని ప్రవల్లిక సూసైడ్‌పై దర్యాప్తు జరపాలన్నప్పుడు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినదించినప్పుడు.. యువత గొంతు నొక్కి, ర్యాలీలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేయించడమే కాకుండా ఒకానొక దశలో టియర్ గ్యాస్ ప్రయోగించింది గత బీఆర్ఎస్ సర్కార్. పైగా సూసైడ్ చేసుకున్న అమ్మాయిని అవహేళన చేసేలా నాటి మంత్రి కేటీఆర్ కామెంట్లూ చేశారు. ఉద్యోగానికే అప్లై చేసుకోలేదంటూ మాట్లాడారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారగానే యువతే తమకు ఆశాకిరణమని బీఆర్ఎస్ చెప్తున్నది. ‘‘యువతే బలం.. యువతే భవిష్యత్తు.. యువత కోసం కేటీఆర్ తోడున్నాడు..” అంటూ నినాదం అందుకున్నది.

జంతర్ మంతర్‌లో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఖండిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేటీఆర్ పుట్టినరోజు (జులై 24)న ‘యువత భవిష్యత్తు కోసం సంకల్ప దినం’ పేరుతో ఇక్కడ ఆందోళన నిర్వహించనుంది. అధికారంలో ఉన్నప్పుడు నిరసనలను అణచివేసేందుకు ఏకంగా ఈ ధర్నాచౌక్ నే బీఆర్ఎస్ ఎత్తివేయించింది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రుల రాజీనామాకు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్న గులాబీ పార్టీ.. ఇప్పుడు కేంద్ర విద్యా మంత్రి రాజీనామాకు పట్టుబడుతున్నది. పవర్ కోసం పొలిటికల్ ఎజెండా మారిందనే విమర్శలను మూటగట్టుకుంటున్నది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు మరో వైఖరా? అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో బీఆర్ఎస్ తీరుపై చర్చ మొదలైంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీఆర్ఎస్ ఖండించింది. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత చేపట్టిన ఉద్యమాల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలపై ఇప్పుడు నిందలు ఎదుర్కొంటున్నది.

జంతర్‌మంతర్ ఘటనపై అదే రోజు కేటీఆర్ ట్వీట్ ద్వారా పోలీసుల చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించాలని జూన్ 8న కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పవర్‌లో ఉన్నప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులపై ప్రతాపం చూపించి ఇప్పుడు మళ్లీ పవర్‌లోకి రావాలన్న టార్గెట్‌తో యూత్‌కు అండగా నిలబడుతున్నారన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి.

స్వరాష్ట్రంలోనూ టియర్ గ్యాస్

– తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగం కామన్ ఫినామినాగా మారింది.
– సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని, పోలీసుల దూకుడు తగ్గుతుందని అన్ని సెక్షన్ల ప్రజలూ భావించారు. కానీ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నియామక పరీక్షల నిర్వహణ, ఖాళీల భర్తీ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగానే పలు ఆందోళనలు జరిగాయి.
– టీజేఏసీ, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు నిర్వహించిన ర్యాలీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ముందస్తు అరెస్టులు, అదుపులోకి తీసుకోవడం, రోడ్లమీద ఈడ్చుకెళ్లడం.. పునరావృతమయ్యాయి.
– ఉస్మానియా వర్సిటీలో 2017 డిసెంబర్‌లో నిరుద్యోగి మురళి ఆత్మహత్య అనంతరం క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఫస్ట్ టైమ్ టియర్ గ్యాస్ చూశారు విద్యార్థులు. హాస్టళ్లలోకి ప్రవేశించి బలవంతంగా తీసుకెళ్లారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

యువతకు అండ.. మళ్లీ పవర్‌ కోసమేనా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో యువత, జెన్-జీ ప్రభావం యావత్తు దేశాన్నే ఆలోచనలో పడేసింది. విద్యార్థులు, యువతకు దూరమైతే మనుగడ కష్టమేనని పలు పార్టీలు గ్రహించాయి. తెలంగాణలో సైతం వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందనే అభిప్రాయాలు పార్టీల్లో నెలకొన్నాయి. కాంగ్రెస్ ‘యూత్ డిక్లరేషన్‌’కు కౌంటర్‌గా బీఆర్ఎస్ సరూర్‌నగర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’తో యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నదనే మాటలూ వినిపించాయి.

ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆందోళనలు చేయడం వంటివి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎజెండాగా పెట్టుకున్నదనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ “యువతే బలం.. యువతే భవిష్యత్తు.. యువత కోసం కేటీర్ తోడున్నాడు” అంటూ కొత్త స్లోగన్‌ను తీసుకొచ్చింది. కేటీఆర్ పుట్టినరోజు (జులై 24)న ధర్నాచౌక్‌లో ‘యువత భవిష్యత్తు కోసం సంకల్ప దినం’ పేరుతో ఢిల్లీ జంతర్ మంతర్ ఘటనకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.

ఆ రోజు బీఆర్ఎస్ ఎంపీలెక్కడ?

– ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసిన జులై 20న పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ‘చలో సంసద్’ ర్యాలీ తీస్తున్నప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోనే ఉన్నారు. కానీ విద్యార్థులపై లాఠీఛార్జి జరిగిన తర్వాత జంతర్ మంతర్‌కు వెళ్లలేదనే విమర్శలూ ఆ పార్టీపైన వచ్చాయి.
– ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ లాంటివి కొన్ని జంతర్ మంతర్ దగ్గరకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపాయి. గాయపడిన విద్యార్థులను కొన్ని పార్టీల నేతలు ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడ అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
– లాఠీచార్జి జరిగిన రోజునే ఢిల్లీ పోలీసుల చర్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ, ఢిల్లీలోనే ఉన్న ఆ పార్టీ ఎంపీలు మాత్రం జంతర్ మంతర్ వద్దకు వెళ్లకపోవడం చర్చకు దారితీసింది. ప్రకటనలు ఒకలా ఆచరణ మరోలా ఉందనే విమర్శలకు తావిచ్చినట్లయింది.

నాటి నిషేధిత ‘ధర్నా చౌక్’ ఇప్పుడు వేదిక

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ధర్నాచౌక్ అన్ని సెక్షన్ల ప్రజలకు ఒక వేదిక. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇదే కీలక గొంతుకగామారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ధర్నాచౌక్‌ను ఎత్తేసింది. చివరికి ప్రజలు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఆనాడు నిషేధించిన ‘ధర్నాచౌక్’ ఇప్పుడు నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీకి వేదికగా మారింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ద్వారా ఆటో డ్రైవర్ల ఉపాధి ప్రశ్నార్థకమైందంటూ కార్మిక సంఘాలు 2024 నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఇక్కడ నిర్వహించిన ‘మహా ధర్నా’కు కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు శుక్రవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న ఆందోళనకు హాజరవుతున్నారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఘటనలు :

2016 జూలై: ఈఏఎమ్‌సెట్-2 (మెడికల్) ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైంది. కోచింగ్ సెంటర్లు, ఏజెంట్లు కలిసి ప్రశ్నపత్రాలను కొందరు విద్యార్థులకు విక్రయించినట్లు సీఐడీ విచారణలో తేలడంతో ఆ పరీక్షను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ నిర్వహించింది.
2019 ఏప్రిల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులకు తప్పుడు ఫలితాలు, మార్కుల గందరగోళం, రీవెరిఫికేషన్ తర్వాతా మార్కులు మారడంతో 20 మందికి పైగా విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగానే చర్చనీయాంశమయ్యాయి. ఆత్మహత్యలు వద్దని, తప్పుల్ని సరిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు. విద్యామంత్రిగా జగదీశ్‌రెడ్డి రిజైన్ చేయాలన్న డిమాండ్ వచ్చినా ఆ పదవిలోనే కొనసాగారు. ఆ తర్వాత ఆ శాఖను సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ కేటాయించారు.
2022 అక్టోబర్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల రద్దు. మనస్థాపంతో ప్రవల్లిక అనే విద్యార్థిని ఆత్మహత్య. వ్యక్తిగత కారణాలు అంటూ కామెంట్ చేసిన కేటీఆర్. పోలీసుల దర్యాప్తులో వాట్సాప్ చాట్స్ లో లవ్ ఎఫైర్ ఉందంటూ తేలిందని ప్రస్తావన. అసలు ఆ అమ్మాయి ఎగ్జామ్కే అప్లయ్ చేసుకోలేదంటూ వాదన. కేటీఆర్ తీరుపై తిరగబడ్డ యువత.
2023 మార్చి: పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే పరీక్షల ప్రశ్నాత్రాలు లీక్. బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల ముందస్తు వాయిదా.
2023 ఏప్రిల్: పదో తరగతి పరీక్షల సమయంలో వికారాబాద్‌ జిల్లాలో తెలుగు, హన్మకొండలోని కమలాపూర్‌లో హిందీ ప్రశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయన్న ఆరోపణలు. ఇది రాజకీయ కుట్ర అంటూ అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై కేసు, అరెస్టు, రిమాండ్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>